Tuesday, June 17, 2014

గుదిబండగా మారిన 370వ అధికరణ

గుదిబండగా మారిన 370వ అధికరణ - గౌతం ముఖర్జీ

నూతన ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో సహాయమంత్రి జితేం ద్ర సింగ్ గత మే 28న ఒక ప్రకటన చేస్తూ, జమ్ము-కాశ్మీర్‌కు అనువర్తింప జేస్తున్న 370వ అధికరణంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలివుందని పేర్కొనడంపై వివాదం చెలరేగింది. నిజానికి ఈ అధికరణాన్ని ఎత్తివేయాలని భారతీయ జనతాపార్టీ (్భజపా)ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న మాట వాస్తవం. దీనిపై దేశవ్యాప్తంగా వెల్లడైన అభిప్రాయాల మాట అట్లా ఉంచితే, ఈ అధికరణంలో మార్పు చేయడానికి అవసరమైన బలం ప్రస్తుత భాజపా ప్రభుత్వానికి ఉన్నదా? అన్న ప్రశ్న సహేతుకమైంది. ఎందుకంటే 370 అధికరణాన్ని ఎత్తివేయడం వల్ల జమ్ము-కాశ్మీర్‌కు ఇప్పటివరకు కల్పిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి తొలగిపోతుంది. మరిది సాధ్యం కావాలంటే పార్లమెంటులో సరికొత్త తీర్మానంపై ఓటింగ్ జరపడం, లేదా రాజ్యాంగ సవరణ అవసరం. అందుకోసం ప్రస్తుత లోక్‌సభలో భాజపా నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి 362 (మొత్తం లోక్‌సభ సభ్యుల సంఖ్య 543) మంది సభ్యుల మద్దతు అవసరం. ఒకవేళ అటువంటి తీర్మానం ప్రవేశపెట్టినట్టయితే ఎన్‌డిఎ ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ సాధనకు మరో 30 మంది సభ్యుల మద్దతు అవసరవౌతుంది.

మరి తరచి చూస్తే ఈ సభ్యుల మద్దతు పొందడం ప్రస్తుత లోక్‌సభలో పెద్ద సమస్య కాకపోవచ్చు. జాగ్రత్తగా వ్యూహాత్మక వైఖరితో ముందుకెళితే పెద్ద కష్టం కాబోదు. ఎట్లా అంటే... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ల మద్దతు పొందగలిగితే తీర్మానం గట్టెక్కడం ఖాయం. వీరి మద్దతు పొంద గలిగితే బిల్లుపై చర్చ జరిగిన తర్వాత నిర్వహించే ఓటింగ్‌లో ప్రభుత్వం గెలుపు సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఒకవేళ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించినా, లోక్‌సభలో 2/3వ వంతు మెజారిటీ (్ఫ్లర్ మేనేజ్‌మెంట్ ద్వారా) ఉన్నది కనుక, అక్కడ కూడా తీర్మానానికి మెజారిటీ సభ్యుల మద్దతు లభించగలదు.

జమ్ము-కాశ్మీర్ నుంచి కూడ ఒక ఆమోదం దానికదే లభించడానికి కూడ ఎన్నో మార్గాలున్నాయి. జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయంతో పాటు, రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. ఈ విషయంలో జమ్ము-లడఖ్ ప్రాంతాల అభిప్రాయాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ఈ ప్రాంతాల ప్రజలు మొత్తం మానవ జనాభా పరంగా సమూలమైన మార్పును కోరుతున్నారు. అధిక సంఖ్యలో భారతీయులు జమ్ము-కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేసి వ్యాపారాలు చేసుకోవాలని, పెట్టుబడులు స్వేచ్ఛగా తీసుకొని రావాలని కోరుతున్నారు. మరి వీరి కోర్కె నెరవేరాలంటే 370 అధికరణం అమల్లో ఉన్నంతకాలం సాధ్యం కాదు. అయితే స్థానికంగా ఎవరైనా జవాబుదారీగా ఉండటానికి ముందుకు వచ్చినా వీరి కోర్కె తీరడానికి ఏవిధమైన అడ్డంకులు ఉండబోవు. ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వం పుణ్యమాని చాలా తక్కువ అభివృద్ధి మాత్రమే చోటు చేసుకున్నదని, ఈ ప్రాంత (జమ్ము- లడఖ్) ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు తమపట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంభించిందన్న అభిప్రాయం ఈ ప్రాంత వాసుల్లో బలంగా ఉంది. కాశ్మీర్ లోయ ప్రాంతానికి చెందిన కాశ్మీరీ పండిట్లు దాదాపుగా తమ స్వస్థలం నుంచి బహిష్కరణకు గురయ్యారు. స్వదేశంలోనే కాందిశీకులుగా జీవనం వెళ్ళదీసే దుస్థితికి వారిలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వారి ఆస్తులను దారుణంగా దోచుకున్నారు. నిలువనీడలేని వారి దుస్థితికి ఎవరిని ప్రశ్నించాలి?

కాశ్మీర్ లోయనుంచి పండిట్లను సమూలంగా వెళ్ళగొట్టడం, పెద్ద నేరం మాత్రమే కాదు, తీవ్రస్థాయి మానవ హక్కుల ఉల్లంఘన కూడ. రాజ్యాంగ విరుద్ధంగా జమ్ము- కాశ్మీర్‌లోని మెజారిటీ ప్రజలు పాల్పడిన ఈ అనైతిక దుశ్చర్యను నిరోధించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. అంతేకాదు దారుణంగా రాష్ట్రంనుంచి వెలివేతకు గురైన కాశ్మీరీ పండిట్లను తిరిగి వారి స్వస్థలాలకు రప్పించి, తగిన నష్టపరిహారం ఇప్పించడమే కాకుండా రక్షణ కల్పించాల్సిన తన బాధ్యతను కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విస్మరించింది. ఇంతటి దారుణ దుశ్చర్యకు పాల్పడిన జమ్ము-కాశ్మీర్ ప్రభుత్వం మరియు ఆ రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం మనుగడ సాగిస్తున్నది కేవలం కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధుల సాయంతోనే! పర్యాటక రంగం, ఇతర కుటీర పరిశ్రమలనుంచి వస్తున్న అతి స్వల్ప ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వ మనుగడ సాగించడం చాలా కష్టం.

అసాధారణ రీతిలో కాశ్మీర్ లోయనుంచి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న దారుణమైన ముళ్ళ వెనుక అసలు నిజం ఎల్లవేళలా తెరమరుగున ఉండిపోతున్నది. పరిస్థితిని పరిశీలిస్తే, జమ్ము-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం వల్ల లబ్ది పొందుతున్నది కేవలం నేషనల్ కాన్ఫరెన్స్‌కు నేతృత్వం వహిస్తున్న అబ్దుల్లా మరియి ప్రతిపక్షమైన పిడిపి అధినేత ముఫ్తీమహమ్మద్ సరుూద్ కుటుంబాలు మాత్రమేనని పరిస్థితిని పరిశీలిస్తే అనుమానం రాకమానదు. ఎందుకంటే అక్కడ ‘క్యాబోట్లు’, ‘లాడ్జ్‌లు’, అన్నింటా వారిదే ఏకస్వామ్యం కొనసాగుతోంది. జమ్ము-కాశ్మీర్‌లో ఏ వ్యాపారానికైనా తామే హక్కుదార్లమన్న అహంకారం వారి దౌర్జన్యకాండలో కనిపిస్తుంది. ముఖ్యంగా 370వ అధికరణంపై చర్చ అనగానే క్షణం ఆలస్యం చేయకుండా తీవ్రస్థాయిలో స్పందించిన తీరును చూస్తుంటే, ఈ అధికరణం వారికి కల్పతరువుగా మారిందన్న సత్యం బోధపడుతుంది.

2014 సాధారణ ఎన్నికల్లో జమ్ము-లఢక్ ప్రాంతాల్లో భారతీయ జనతాపార్టీ మంచి ఫలితాలు సాధించింది. అందువల్ల ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్ట నష్టాల గురించి భాజపా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేతిలో వీటో అధికారం ఉన్నంతకాలం ఏ చర్య తీసుకోవాలనుకున్నా అది దుస్సాధ్యం. ఒమర్ అబ్దుల్లా చెబుతున్న దానికి, దేశంలోని ఇతరప్రాంతాలకు చెందిన రాజ్యాంగ నిపుణులు చెబుతున్న దానికి ఎంతో తేడా ఉన్నది.

చాలామంది న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు మాత్రం ఒక్క విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. 370 అధికరణాన్ని ప్రభుత్వం ఎత్తివేయాలన్నదే వారి నిశ్చితాభిప్రాయం. చారిత్రకంగా చూస్తే ఈ అధికరణాన్ని రూపొందించడం నెహ్రూ చేసిన ప్రథమ తప్పిదం. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని నెహ్రూ అప్పట్లో పేర్కొన్నప్పటికీ, గత మే 27న నెహ్రూ 50వ వర్థంతి జరుపుకున్న నాటికి కూడా ఏవిధమైన మార్పు లేకుండా అది కొనసాగుతూనే ఉంది. మరి ఇక్కడ ‘తాత్కాలిక’మన్న పదాన్ని సైద్ధాంతికపరంగా మరింత విస్తృతకోణంలో ఆలోచించాలా? కానీ మనం అంగీకరించాల్సిన పచ్చినిజం ఒకటుంది. కేవలం ఈ అధికరణం కారణంగా కలుగుతున్న అనేక అడ్డంకుల వల్ల భారతదేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంటోంది. పెద్ద మొత్తంలో ధనాన్ని కేటాయిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంపై అతి తక్కువ నియంత్రణ కలిగివుండటమన్న దుస్థితికి మించిన దౌర్భాగ్యం మరోటుండబోదు.

ఇటువంటి గాయాలకుతోడు అత్యంత అవమానకరమైన అంశమేమంటే, లోయలో వేర్పాటువాదులు, ఉగ్రవాదుల సానుభూతిపరులు, వారికి సహాయం చేసేవారిని జమ్ము-కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవంతో చూడటం. దీనికి తోడు భారత సాయుధ మరియు పారామిలటరీ బలగాలు, ఇంటెలిజెన్స్ సంస్థలను కేవలం సరిహద్దు రక్షణకు మాత్రమే కేటాయించడం. ఇందుకోసం అంతూపంతూ లేకుండా ప్రజల ధనం విచ్చలవిడిగా ఖర్చవుతోంది. ఇంత కష్టపడి ఇంత ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ ఫలితమేమైనా ఉన్నదా అంటే అదీ లేదు. భద్రతా బలగాలు ఎక్కడ ఏ ఎన్‌కౌంటర్‌కు పాల్పడినా...అది నకిలీ ఎన్‌కౌంటర్ అనీ, అమాయకులను బలితీసుకున్నారంటూ తీవ్రస్థాయిలో గొంతు చించుకొని నానా గందరగోళం చేయడం ఒక వ్యూహం ప్రకారం కొనసాగుతున్న వైపరీత్యం. నిజం చెప్పాలంటే 1947 నుంచి ఇప్పటి వరకు జరిగిన పోరాటాల్లో మరణించిన మన బలగాల కంటే, శాంతి సమయంలో జమ్ము-కాశ్మీర్‌లో నిర్వహించిన విధి నిర్వహణలో మృతులైనవారి సంఖ్య చాలా అధికమన్నది మాత్రం నిష్టుర సత్యం.

ప్రస్తుత పరిణామాలను గమనిస్తే నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపిలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకోసం గంగవెర్రులెత్తినట్టు చేసిన ప్రకటనలు తప్ప, 370 అధికరణాన్ని ఎత్తివేసే యత్నాలను అడ్డుకోవడానికి పెద్దగా చెప్పుకోదగింది ఏమీ లేదు. ఒక్కసారి ఇందిరాగాంధీ హయాంను గుర్తు చేసుకోండి. బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న సంస్థానాధీశులకు..తమ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసినందుకు, వారికి ‘రాజ భరణం’ పేరుతో చెల్లిస్తూ వస్తున్న మొత్తాన్ని ఇందిరాగాంధి ధైర్యంగా రద్దు చేసింది. నిజానికి బ్రిటిష్ ప్రభుత్వంతో వారు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వారికి చెల్లించే రాజభరణాలను రద్దు చేయడానికి వీల్లేదు. కానీ ఇందిర ఆ పని చేసింది. పర్యవసానం ఏమయింది? నొరెత్తినవారు లేరు. అదేవిధంగా ప్రైవేటు బ్యాంకులు. కొంత కాలంపాటు అవి మనదేశంలో ఎన్నో రకాల సదుపాయాలు, సౌకర్యాలను అనుభవిస్తూ, ఇబ్బడి ముబ్బడిగా లాభాలను దండుకున్నాయి. కానీ మళ్ళీ ఇందిరాగాంధీ..ఈ బ్యాంకులన్నింటినీ జాతీ యం చేశారు. ఎవరు ప్రతిఘటించారు? ఎంతమేర ప్రతిఘటించారు? జాతీయం చేసిన తర్వాత మిన్నువిరిగి మీదపడలేదు. అంతా సవ్యంగా ప్రశాంతంగా జరిగిపోయింది. మరి దేశ ఆర్థిక వ్యవస్థలో జాతీయ బ్యాంకులు నేడు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న అధికరణాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసిందనుకుందాం. దీనివల్ల భద్రతాపరమైన మరియు వేర్పాటు వాదుల కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తవచ్చు. అంతేకాదు పాకిస్థాన్, బహుశా చైనా, రష్యా, పశ్చిమ దేశాల నుంచి బహుశా వత్తిళ్ళు రాకమానవు. కానీ ఎప్పటికప్పుడు ఆ రాష్ట్రానికి ఇస్తున్న భారీ రాయితీలను మన దేశం ఎంతకాలం భరించగలదు?

1 comment:

  1. sir, verpatu vadam tho neggukuntu vachevallu unnantha varaku ee article lo change raadandi...

    -Poorna chand

    ReplyDelete