మోడీ సర్కార్లో ఇంకా మంత్రులంతా పూర్తిగా బాధ్యతలు కూడా ప్రారంభించక ముందే... వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్మృతి ఇరానీకి కేబినెట్ హోదా.. అదీ దేశ ఉన్నత విద్యావ్యవస్థకు ఆయువుపట్టు అయిన మానవ వనరుల శాఖను అప్పగించడంపై ఇప్పటికే వివాదం మొదలైంది. ఇది అంత తీవ్రమైంది కాకపోయినా.. దేశంలోనే అత్యంత వివాదాస్పమైన ఆర్టికల్ 370 తేనెతుట్టెను కదపడమంటే మామూలు విషయం కాదు. మోడీ సర్కారు ముందు ఎన్నో సవాళ్లు ఉండగా.. ఇలాంటి అత్యంత సున్నితమైన సమస్యపై బీజేపీ సర్కారు కావాలని ఎందుకు వివాదం మొదలుపెట్టిందన్నది ఆలోచించతగ్గవిషయం.
అసలు ఈ ఆర్టికల్ 370 ఏంటి..? జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు భారత రాజ్యంగంలో కల్పించిన వెసులుబాటే ఈ ఆర్టికల్ 370. 1949 నుండి ఇది అమల్లో ఉంది. దీని ప్రకారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక హక్కులుంటాయి. జమ్మూకాశ్మీర్ వాసులు కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ స్థిరాస్థుల అమ్మకాలు , కొనుగోళ్లు చేయకూడదు. ఇక్కడ భూములపై ఇతర ప్రాంతవాసులకు ఎలాంటి హక్కులు కల్పించరు. ఈ ఆర్టికల్ కారణంగానే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి దూరమవుతోందని.. దేశంలో ఏ రాష్ట్ర్రానికి లేని స్వయం ప్రతిపత్తి జమ్మూకాశ్మీర్ కు మాత్రం ఎందుకుండాలని.. బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే బీజేపీ వాదనలో వాస్తవం కొంత మాత్రమే. ఇదే తరహాలో ఆర్టికల్ 371లోని కొన్ని అధికరణ ద్వారా చాలా రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిందన్న సంగతిని మాత్రం పెద్దగా పట్టించుకోదు.
ఇప్పుడు ఎందుకు వివాదం..? బీజేపీ, దాని మూలాలైన హిందుత్వ సంస్థలు... ఎప్పటి నుంచో ఆర్టికల్ 370 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని కోరుతున్నాయి. దశాబ్దాల తరబడి ఈ సంస్థలు, బీజేపీ గొంతుచించుకుంటున్నా.. ఈ డిమాండ్ నెరవేరే అవకాశం లభించలేదు. బీజేపీ ఎప్పుడూ సొంతంగా అధికారం చేపట్టకపోవడం.. కాంగ్రెస్ వంటి సెక్యులర్ పార్టీలు ఆ దిశగా కూడా ఆలోచించకపోవడంతో హిందుత్వ సంస్థల చిరకాల వాంఛ అలాగే ఉండిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు నరేంద్రమోడీ పుణ్యమా అని.. బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చేటప్పటికి.. మళ్లీ ఈ వివాదం ఊపిరిపోసుకుంటోంది. తన మాతృ సంస్థలను సంతృప్తి పరిచేందుకు బీజేపీ నేతలు .. ఆర్టికల్ 370పై చర్చ అవసరం.. అంటూ కేంద్ర మంత్రి.. అందులోనూ ప్రధానమంత్రి కార్యాలయం మంత్రి... జితేంద్ర ప్రసాద ఈ వివాదానికి తెరతీశారు. ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీరీ ప్రజలకు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోందన్నారు జితేంద్ర ప్రసాద. బీజేపీ అధికార పగ్గాలు అందుకుందని తెలియగానే ఇలాంటి వివాదాలు వస్తాయని అందరూ ఊహించిందే అయినా.. మరీ ఇంత త్వరగా.. కనీసం వారం కూడా కాకుండానే.. బాధ్యతలు చేపట్టిన రోజే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కేవలం యథాలాపంగా జరిగిందని అనుకునే వీల్లేదు.
ఇక ముందు ఏం జరగబోతోంది... ? జమ్మూకాశ్మీర్ కు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా కనిపించినా.. ఇది దేశమంతటినీ ప్రభావితం చేసే సున్నితమైన సమస్య.. మెజారిటీ ఉంది కదా అని బీజేపీ, దాని మాతృసంస్థలు... ఏకపక్షంగా తమ చిరకాల వాంఛలను తీర్చుకునే ప్రయత్నం చేస్తే.. అవి వికటించే అవకాశాలే ఎక్కువ. నల్లధనం, అవినీతి నిర్మూలన, పేదరిక నిర్మూలన, ఆర్థిక స్థిరత్వ సాధన.. ఇలా ఎన్నో సమస్యలు మోడీ సర్కారుకు ఆహ్వనం పలుకుతున్న సమయంలో ఇలాంటి వివాదాల ద్వారా.. దూకుడు ప్రదర్శిస్తే... అనుకున్న సమయం కంటే ముందుగానే మోడీ చెడ్డపేరు మూటగట్టుకునే ప్రమాదం ఉంది. అసలే గుజరాత్ అల్లర్లు, ఉచకోత ఆరోపణల నేపథ్యం ఉన్న మోడీ సర్కారు.. తొలి అడుగులు ఎంతో జాగ్రత్తగా వేయాల్సింది పోయి.. ఇలా వివాదాలతో శ్రీకారం చుట్టడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ వివాదానికి ఎంత త్వరగా ముగింపు పలికింతే అంత మంచిది.
-searched eyes